కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడిపిస్తున్న ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ పేదరికంలో ఉన్న తన కుటుంబ సభ్యుల కోసం ఆటో నేర్చుకొని తద్వారా ప్రతిరోజు కొన్ని డబ్బులు సంపాదిస్తున్న నల్గొండకు చెందిన సబిత విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన ఆమెకు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకొని, ఈ మేరకు ఆమెకు సహాయం అందించాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కేవలం మగవారే సాధారణంగా కనిపించే ఆటోను నడిపించే పనికి సబిత పూనుకొని, ధైర్యంగా కుటుంబాన్ని నిలబెట్టిన తీరు పట్ల మంత్రి అచ్చేరువొందారు. ఆమెను స్వయంగా కలిసి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
హామీ ఇచ్చిన మేరకు సబితను ఈరోజు ప్రగతి భవన్ కి పిలిపించుకొని ఆమెతో సంభాషించారు. సబిత కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ ఆమెకి ఏం కావాలో తెలుసుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తన తండ్రిని కోల్పోయిన సబిత తన తల్లి కొందరి ఇళ్ళల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపింది. సబిత పేదరికం దృష్టిలో ఉంచుకొని 2 బీహెచ్‌కే ప్రొసీడింగ్స్ తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ప్రొసీడింగ్స్ ని కూడా అందించారు. సబిత చదువుకుంటా అంటే ఆమెకు సహాయం అదిస్తానని హామీ ఇచ్చిన కేటీఆర్.. భవిష్యత్తులోనూ ఆమెకు అండగా ఉంటామని తెలిపారు.
యువ మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలుగుతారని సబిత నిరూపించిందని, పట్టుదల ఉంటే కష్టాలను ఎదుర్కోవడం అసాధ్యం కాదని నిరూపించిన గొప్ప ధైర్య సాహసి సబిత అని ఆయన అన్నారు. సబితా తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు యువతులకు ఖచ్చితంగా స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మంత్రి కేటీఆర్ తన ప్రయత్నాలకు అండగా నిలవడం పట్ల సబిత సంతోషం వ్యక్తం చేశారు. తనను పిలిపించుకొని తన గురించి వివరాలు అడిగి తెలుసుకొని, అడిగిన మేరకు కుటుంబానికి సహాయం అందించడం ఎన్నటికీ మరచిపోలేనని ఆమె తెలిపింది. కేటీఆర్ గారు అందించిన సహాయం, స్ఫూర్తితో భవిష్యత్తు లో మరిన్ని మంచి లక్ష్యాలను చేరుకుంటానన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది.