NTV Telugu Site icon

Minister Harish Rao: రాహుల్ ఎందుకొస్తున్నావ్.. ఏం చెప్పడానికి..?

రాహుల్‌ గాంధీ.. తెలంగాణ పర్యటనపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి హరీష్‌రావు.. పెద్దపల్లిలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పై ఫైర్‌ అయ్యారు. రాహుల్ ఎందుకోసం వస్తున్నావ్‌..? ఏం చెప్పడానికి వస్తున్నావ్..? మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ ది అని మండిపడ్డ ఆయన.. అధికారం కోసం ఎంత నీచమైన స్థాయికైనా దిగజారే పరిస్థితి వారిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Nara Lokesh: సీఎం జగన్‌కు లోకేష్ ‘మాస్’ లేఖ

తెలంగాణ రావొద్దని అడ్డం పడ్డ ద్రోహి చంద్రబాబుతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా..? అని ప్రశ్నించారు హరీష్‌రావు. అధికారం కోసం ఆత్మాభిమానం మంట గలిపెస్తారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాది బతుకు దెరువు కోసం ఆరాటం.. వాళ్లది కుర్చీల కోసం కొట్లాట అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి వస్తున్నావు రాహుల్ గాంధీ అని నిలదీశారు.. ఇక, రాహుల్ ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ గల్లంతు అని సెటైర్లు వేశారు. ఆయన బాధ్యత తీసుకున్న తర్వాత జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే తక్కువగా అయ్యిందని విమర్శించారు.

మరోవైపు, మిస్టర్ బండి సంజయ్.. కేంద్రం లో ఉన్న 15.62 లక్షల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పండి అని సవాల్‌ చేశారు హరీష్‌రావు.. తాజాగా 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే వారి నోటి నుంచి మాట రావడం లేదన్నారు. కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత, కరెంట్ కోతలు, ఎరువుల కొరత.. రైతుల కష్టాలు, కన్నీళ్లు.. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నీళ్ళు రాక పంటలు ఎండి పోయేవి అని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఇస్తున్నట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కానే కాదు అన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ముడున్నరెళ్ళలో పూర్తి చేశామన్నారు. ఒకప్పుడు నీళ్ళ కోసం ధర్నాలు.. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి ఆపండి అంటున్నారన్నారు హరీష్‌రావు.

Show comments