టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. గురువారం కొడంగల్‌లో పర్యటించిన హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప అభివృద్ధి గడప దాటలేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఇక్కడ అభివృద్ధి చేయలేక పోయారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్త రూపు సంతరించుకున్నదని, రేపో మాపో పాలమూరు నీళ్ళు తెచ్చి మీ పాదాలు కడుగుతామన్నారు. పాలమూరు పై కేసులు వేస్తున్నారు, అడ్డుకుంటున్నారు, అయినా పనులు ఆగవని ఆయన స్పష్టం చేశారు. మీ పక్కనే కర్ణాటక బార్డర్ ఉంది.. ఒక్కసారి అడిగి తెలుసుకొండి.. కర్ణాటకలో డబుల్ డెక్కర్ ప్రభుత్వం ఉంది.. ఏమైందీ 6 గంటలు కూడా కరెంట్ రావడం లేదని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తరు.. 8,9 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నావు ఎందుకు అభివృద్ధి చేయలేదుంటూ ఆయన మండిపడ్డారు. ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ, బస్ డిపో ఎందుకు తేలేదని, రైతు డిక్లరేషన్ అంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ లో చేయండని ఆయన హితవు పలికారు. మీరు అధికారంలోకి వచ్చేది లేదు.. ఆ అవకాశమే లేదని ఆయన జోస్యం చెప్పారు. కేంద్రం మన మీద కక్ష కట్టిందని, కాంగ్రెస్ ఖతం, గతం.. ముగిసిన చరిత్ర.. రాహుల్ అధ్యక్షుడు అయిన తర్వాత 100 కు 97 శాతం ఓటమేనని ఆయన వ్యాఖ్యానించారు.