ఎంజీఎం హాస్పటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ పరికరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్ ఎమ్మెల్యే భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, బస్వరాజు సారయ్య లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎంజీఎంకు వచ్చే రోగులకు అత్యాధునిక వైద్య విధానం అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో అత్యాధునిక సిటీ స్కాన్ అత్యవసర విభాగం వద్ద ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా.. 12 కోట్ల రూపాయలతో ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని ఆయన పేర్కొన్నారు. 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరుగుతోందని… ఎంజీఎం ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వం ఆసుపత్రల్లో అందుబాటులోకి వస్తాయన్నారు.