Minister Seethakka : ములుగు జిల్లా మేడారం మహాజాతర ఏర్పాట్లలో భాగంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొత్త రహదారులు నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు. వచ్చే జనవరిలో జరగబోయే మహా జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం వేగవంతంగా పనిచేస్తోందని ఆమె తెలిపారు.
రహదారులు అత్యంత కీలకమని గుర్తించిన మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీతో పాటు మేడారం సర్కిల్ పోలీస్ అధికారులతో కలిసి కొత్త మార్గాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతో పాటు అటవీ మార్గాల్లో కొత్త రహదారులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ లేకుండా భక్తులు సులభంగా మేడారం ఆలయానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కొండపర్తి–గోనెపల్లి–ముత్తాపురం మీదుగా పడికాపురం వరకు రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు, కాల్వపల్లి నుంచి కన్నేపల్లి వరకు, కాల్వపల్లి నుంచి ఊరటం వరకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ఊరటం మార్గంలో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఛత్తీస్గడ్, ఖమ్మం వైపుల నుంచి వచ్చే భక్తులకు చిన్నబోయినపల్లి మీదుగా ఊరటం దాకా కొత్త మార్గం అందుబాటులోకి రానుంది.
మహాజాతరలోపు రూ.16.5 కోట్లతో కొండాయి వాగుపై వంతెనను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. దీనికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రి ఇప్పటికే మంజూరు చేశారని తెలిపారు. జాతర సమయంలో అటవీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు, మట్టి రోడ్లు, బీటీ రోడ్లు, డివైడర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
సమ్మక్క–సారలమ్మ కీర్తి మరింత ఇనుమడించేలా జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయానికి సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ పూజారుల ఆచారాలు, విశ్వాసాలు, సంప్రదాయాలకు భంగం కలగకుండా పనులు జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. గతంలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించగా, వాటిని అడ్డుకున్నానని, ఆదివాసీ సంప్రదాయాల రక్షణ తన బాధ్యతగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు. భక్తులు దుష్ప్రచారాలను నమ్మవద్దని, సమ్మక్క–సారలమ్మ కీర్తిని మరింత పెంచేలా ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.