NTV Telugu Site icon

ప్రతీకారం తప్పదు.. మావోయిస్టుల హెచ్చరిక

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ..

పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఖండించిన ఆయన.. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు ఆరుగురిని కాల్చిచంపారని ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని లేఖద్వారా హెచ్చరించారు. అధికారపార్టీ నేతలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు.. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటున్న మావోయిస్టు పార్టీ.. బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసి తెలంగాణ పోలీసులు కట్టుకథ అల్లుతున్నారని మండిపడ్డారు.. ఇక, పెసలపాడు ఎన్‌కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది మావోయిస్టు పార్టీ..