Marriage in Hospital: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన వధువును ఆస్పత్రి బెడ్‌పైనే పెళ్లి చేసుకున్నాడు యువకుడు.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వధువుకు తాళి కట్టాడు వరుడు. ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే.. అది కూడా ఐసీయూలోని బెడ్‌పైనే తాళి కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
Read Also: Medico Preethi Health Bulletin: డాక్టర్ ప్రీతి పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల..
అయితే.. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి వివాహాన్ని నిశ్చయించారు… ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. ఇవాళ వివాహం జరగాల్సి ఉంది.. కానీ, ఒక రోజు ముందు.. అంటే బుధవారం రోజు అస్వస్థత గురైంది వధువు.. వెంటనే ఆ వధువును మంచిర్యాలకు తీసుకెళ్లారు.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.. అక్కడే ఆమెకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం.. ఐసీయూలో ఉంది వధువు.. అయితే, పెళ్లి వాయిదా వేయడం ఎందుకు? అని.. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు.. ఆస్పత్రిలోనే.. బెడ్‌పైనే పెళ్లి నిర్వహించడానికి పూనుకున్నారు.. ఇంకేముందు.. వరుడుని తీసుకొని ఆస్పత్రికి వెళ్లారు.. ఆసుపత్రిలోనే బెడ్ పై ఉన్న శైలజకు తాళికట్టి భార్యగా చేసుకున్నాడు. అందరి ముందు దండలు మార్చుకుని ఈ జంట ఒక్కటైంది. సంప్రదాయం ప్రకారం.. బెడ్‌పైనే ఉన్న వధువుకు మెట్టలు పెట్టించారు.. అన్ని కార్యక్రమాలు నిర్వహించారు.. ఇద్దరి తరపు బంధువులు వచ్చి.. కొత్త జంటను ఆశీర్వదించారు..అయితే, గతంలోనూ ఆస్పత్రిలో పెళ్లిలు జరిగిన ఘటనలు లేకపోలేదు.. మొత్తంగా ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.. ఫన్నీ కామెంట్లు పెడుతూనే.. కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు నెటిజన్లు.