తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని నేటి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ఉంచనున్నారు. తరువాత నల్లగొండకు తీసుకెళ్లి, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పిస్తారు. అనంతరం నల్గొండ సీపీఎం కార్యాలయం నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఆ తరువాత మల్లు స్వరాజ్యం కొరికి మేరకు 3.30 గంటలకు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆమె పార్థివ దేహాన్ని నల్గొండ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు.