Mallikarjun Kharge On Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో మంగళవారం (01-11-22) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ యాత్రలో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. మోడీ సర్కారు, ఆర్ఎస్ఎస్ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని.. ప్రజల మధ్య విద్వేషాలు, హింస రేకెత్తిస్తున్నాయని ఆరోపించారు. అన్నీ వ్యవస్థల్లో తమ మనుషుల్ని జొప్పించి, నాశనం చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ మతసామరస్యానికి ప్రతీక అని, తనకు ఈ నగరంతో మంచి అనుబంధం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందన్నారు.
అయితే.. కేసీఆర్ మాత్రం ప్రజల్ని విస్మరించి దోచుకుంటున్నారని ఖర్గే ఆరోపణలు చేశారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒక్కటేనన్నారు. పార్లమెంట్‌లో అనేక బిల్లుల విషయంలో ఇద్దరు పరస్పరం సహకారాలు అందించుకుంటున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి, అన్నీ రాష్ట్రాలు ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక బిల్లులకు పార్లమెంట్‌లో టీఆర్ఎస్ మద్దతు ఉందన్నారు. దేశంలో 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. వాటిని భర్తీ చేయటం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. కేంద్రం హామీలను ఉల్లంఘించినందుకే.. రాహుల్ గాంధీ రోడ్డెక్కారన్నారు. అబద్ధాలతో మోడీ ఎక్కువ కాలం పాలించలేరని, ప్రధానిగా కొనసాగే అర్హత మోడీకి లేదని తేల్చి చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, కాంగ్రెస్ చేసిన 70 ఏళ్ల కృషి వల్లే.. మోడీ ప్రధాని కాగలిగారన్నారు. నేడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని హెచ్చరించారు.
హిమాచల్‌కి మాత్రం ఎన్నికలు తేదీలను ప్రకటించారని.. కానీ ఓటమి భయంతో గుజరాత్‌కు మాత్రం ఎన్నికల గడువు వచ్చినా, ఇంతవరకూ ప్రకటించలేదని ఖర్గే దుయ్యబట్టారు. పిల్లల రబ్బర్, పెన్సిల్ నుంచి ప్రతి వస్తువు మీద విచ్చలవిడిగా జీఎస్టీ వేస్తున్నారని మండిపడ్డారు. మోడీ చర్యల వల్ల ధరలు పెరుగుతున్నాయని.. వేతనాలు మాత్రం అలాగే ఉంటున్నాయన్నారు. నిరుద్యోగం కూడా పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. ప్రతీదీ ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.