Site icon NTV Telugu

MLA Malla Reddy : సంక్రాంతి సంబరాల్లో ముగ్గు వేసిన మల్లారెడ్డి..

Mallareddy

Mallareddy

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. పల్లెల్లో, పట్టణాల్లో ముగ్గుల పోటీలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూడూరు – కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కె.ఎల్.ఆర్ (KLR) ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

Komatireddy Venkat Reddy: సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా.. పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు..!

సాధారణంగా ఏ కార్యక్రమానికి వెళ్లినా తనదైన పంచ్‌ డైలాగులతో, సందడితో అందరినీ నవ్వించే మల్లారెడ్డి.. ఈ ముగ్గుల పోటీల్లో కేవలం అతిథిగానే పరిమితం కాలేదు. పోటీలో పాల్గొన్న మహిళా మణులను ఉత్సాహపరుస్తూ, స్వయంగా తనూ రంగంలోకి దిగారు. ముగ్గు పిండి పట్టుకుని స్వయంగా నేలపై ముగ్గు వేసి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే ముగ్గు వేయడం చూసి అక్కడి మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవ్వడంలో మల్లారెడ్డి ఎప్పుడూ ముందుంటారని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని, ముఖ్యంగా మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు చక్కని వేదికలని కొనియాడారు. లోగిళ్లన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతుంటే పండుగ కళ ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు ఆకిటి నవీన్ రెడ్డిని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు మన మూలాలను గుర్తుచేస్తాయని అన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి, వారితో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి ముగ్గు వేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

The Raja Saab: ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘ది రాజా సాబ్’ సరికొత్త రికార్డు!

Exit mobile version