Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. గీతా వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సిలువేరు వెంకన్న అనే గీతా కార్మికుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాటి చెట్టు ఎక్కిన అనంతరం కాలుకున్న గుజి ఊడి పోవడంతో వెంకన్న ప్రమాదంలో పడిపోయాడు. ప్రమాదం తప్పించుకునేందుకు తాటి కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. గాలిలో వేలాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉండిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
Read Also: Maharashtra: మహారాష్ట్ర పుర ఎన్నికల్లో మహాయుతి కూటమి జోరు.. పోలింగ్‌కు ముందే 68 సీట్లు
అయితే, దాదాపు మూడు గంటల పాటు చెట్టుపైనే వేలాడుతూ ఉండిపోయిన వెంకన్న తీవ్రంగా అలసిపోయాడు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తుల సహకారంతో ఫైర్ ఇంజిన్ నిచ్చెన సహాయంతో వెంకన్నను సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంకన్నకు స్వల్ప గాయాలు మాత్రమే కాగా, ప్రాణాపాయం తప్పినందుకు గ్రామస్తులు దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది.