Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!

  • బోనాల వేడుకల్లో భవిష్యవాణి వినిపించిన మాతంగి అనురాధ
  • భక్తుల పూజలకు అమ్మవారు సంతోషించారని వెల్లడి
  • ఐదు వారాల పాటు శాఖ పూజలు చేయాలని సూచన
  • ప్రజా సంక్షేమ ప్రభుత్వాలకు అమ్మవారి ఆశీస్సులు
Laldarwaza

Laldarwaza

Lal Darwaza Rangam : లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం వేడుకలో మాతంగి అనురాధ అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. భక్తులు చేసిన పూజలు, నైవేద్యాలకు అమ్మవారు సంతోషించారని, పసుపు కుంకుమలతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరికలు నెరవేర్చి సుభిక్షంగా చూసుకుంటానని తెలిపారు. అయితే సమాజంలో పాపాలు, అనుకోని విపత్తులు , పసిపిల్లలపై జరుగుతున్న ఘోరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, కలికాలం మూలంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ భక్తితో ఉన్నవారికి ముక్తి, శక్తి, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, గ్రామగ్రామాన తాను ఉండి అందరినీ ఆదుకుంటానని అభయమిచ్చారు.

శాఖ పూజలకు ఆదేశం.. ప్రభుత్వాలకు, భక్తులకు అమ్మవారి ఆశీస్సులు

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండటానికి ఐదు వారాల పాటు శాఖ పూజలు నిర్వహించాలని మాతంగి అనురాధ స్పష్టం చేశారు. చెడు మార్గంలో నడిచేవారిని, నేరాలకు పాల్పడేవారిని తప్పక శిక్షిస్తానని హెచ్చరిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలకు తమ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని వెల్లడించారు. భక్తులు భయపడాల్సిన పనిలేదని, ధర్మంతో ఉండి అమ్మవారిని పూజించే ప్రతీ ఒక్కరికీ రక్షణగా నిలుస్తానని రంగం వేదికగా భవిష్యవాణిలో వినిపించారు.