KTR : తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ నాయకుల జాయినింగ్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ ప్రజల జోష్ చూస్తుంటే మామూలుగా లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ, కొడంగల్‌కు సీఎం తిరుపతి రెడ్డి అని ఆయన సెటైర్ వేశారు. ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిలర్ కూడా కాని ఆయనకు అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు.
కొడంగల్ భూములను తొండలు గుడ్లు పెట్టని భూములు అని రేవంత్ రెడ్డి అన్నాడని, అలాంటి మాటలు మాట్లాడిన ఆయనకు ప్రజలు సరైన సమాధానం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని గుర్తు చేస్తూ, “ఇక్కడ మీరు ఒక్క ఎంపీటీసీ కూడా గెలిపించకపోతే ఢిల్లీ లెవల్లో తెలుస్తుంది” అన్నారు. అంతేకాకుండా.. “మనమే కట్టిన ప్రాజెక్టులు, మనమే చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ మనకు చాలా బాకీ పడింది. ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించండి, వారి మోసాన్ని తిరిగి చూపించండి” అని అన్నారు.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన వరదలపై కూడా కేటీఆర్ ఆరోపణలు చేశారు. “హైదరాబాద్‌లో భారీ వర్షం వచ్చినా ఏమి కాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను పూర్వం కట్టారు. వాతావరణ శాఖ క్లౌడ్‌బరస్ట్ హెచ్చరించినా ఆ రెండు చెరువులను నింపి ఉంచారు. కావాలనే ఒక్కసారిగా నీటిని వదిలి నగరాన్ని ముంచేశారు. మూసీ పక్కన ఉన్న వారిని ఖాళీ చేయించేందుకే ఈ ప్లాన్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసమే నీళ్లు వదిలారు” అని కేటీఆర్ ఆరోపించారు.