Site icon NTV Telugu

KTR : సీఎం, మంత్రుల పంపకాల పరంపర.. రాష్ట్ర పరువుకు మచ్చ

Kavitha Ktr

Kavitha Ktr

KTR : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్‌ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,” అని అన్నారు. నిజాయితీ పరుడిగా పేరున్న రిజ్వి వలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

సీఎం అల్లుడు, మంత్రి కుమారుడి మధ్య టెండర్‌ వివాదం కారణంగా ఒక అధికారి పదవి వదిలేయాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర పరిపాలన దిగజారిపోతున్నదనే సంకేతమని కేటీఆర్‌ విమర్శించారు. “ఈ ప్రభుత్వం నడుపుతోంది ముమ్మాటికీ దండుపాళ్యం ముఠా లాగే,” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవినీతి అధికారులు జైలుకు వెళ్లారని గుర్తుచేస్తూ, “ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే జైలుకు వెళ్లాల్సిందే. ఈ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీసింది. ముఖ్యమంత్రి ఇల్లు పరిపాలనా కేంద్రమా లేక సెటిల్‌మెంట్‌ల అడ్డానా?” అని ప్రశ్నించారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన తుపాకీ వివాదంపై కూడా కేటీఆర్‌ స్పందించారు. “మంత్రి కుమార్తె చెప్పింది.. సీఎం రేవంత్‌ రెడ్డి తుపాకీ ఇచ్చారని. మరోవైపు కొండా మురళి తుపాకీ ఇచ్చారని అంటున్నారు. ఏది అయినా సరే పారిశ్రామికవేత్తను బెదిరించడం నిజమే. పోలీసులు నిజాయితీ వంతులు అయితే దోషులను అరెస్ట్‌ చేయాలి,” అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌ పరిధిలో రౌడీ మూకల ర్యాలీలు, పోలీసుల వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు.

“నా జీవితంలో మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం చూడలేదు. కానీ ఈ రోజుల్లో అది కూడా జరుగుతోంది. ఇది పాలనా పతనానికి సంకేతం,” అని అన్నారు. అంతేకాకుండా.. “ఇలాంటి సెటిల్‌మెంట్‌ల ముఖ్యమంత్రిని నేను ఇప్పటి వరకు చూడలేదు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్–బీజేపీ జాయింట్‌ వెంచర్‌ ప్రభుత్వం. బీజేపీ నేతలు, ముఖ్యంగా బండి సంజయ్‌ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు?” అని ప్రశ్నించారు.

Rohit Sharma: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా గడ్డపై రికార్డు..!

Exit mobile version