Site icon NTV Telugu

KTR : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టతనిచ్చిన కేటీఆర్

Ktr Kavitha

Ktr Kavitha

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కుటుంబం చుట్టూ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన, కవిత పేరు ఎత్తకుండానే పరోక్షంగా గట్టి కౌంటర్లు ఇచ్చారు.

కొత్త పార్టీల ఆవిర్భావంపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు కానీ, ప్రజలు ఓట్లు వేయాలి కదా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మన వ్యక్తిగత బాధలను ప్రజల బాధలుగా చూపిస్తే జనం నమ్మరని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. “పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ, వారిని ఏడిపించకూడదు” అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

షుగర్, బిపి కంట్రోల్ అవ్వాలా? మీ డైట్‌లో ఈ గింజలను చేర్చుకోండి!

రాబోయే ఎన్నికల వ్యూహాలపై స్పష్టతనిస్తూ, భవిష్యత్తులో ఏ పార్టీతోనూ బీఆర్ఎస్‌కు పొత్తులు లేదా సర్దుబాట్లు ఉండబోవని కేటీఆర్ తేల్చి చెప్పారు. తాము చేసిన కొన్ని తప్పుల వల్లే అధికారం కోల్పోయామని అంగీకరిస్తూనే, త్వరలోనే మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2027 నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని ప్రకటించారు.

పార్టీ పేరు మార్పుపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనేది ప్రజల నుంచి వస్తున్న బలమైన కోరిక అని కేటీఆర్ అంగీకరించారు. అయితే, పార్టీలో నిర్ణయాలన్నీ “బాస్” కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతాయని, ఆయన ఏది చెబితే అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. కుటుంబంలో ఎలాంటి పదవుల గొడవలు లేవని, పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ వచ్చే అవకాశం ఉందని, నియోజకవర్గాల సంఖ్య పెరిగినా తమ వద్ద సమర్థవంతమైన నాయకులు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని, స్థిరాస్తి రంగం కుదేలైందని ఆరోపిస్తూ.. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం వస్తుందని, పోతుందని.. కానీ పార్టీ , సిద్ధాంతం శాశ్వతమని ఆయన ముగించారు.

Wife Kills Husband: ఇలా తయారయ్యారేంటే.. ప్రియుడితో కలిసి భర్త హత్య..

Exit mobile version