KTR : కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన హౌస్ అరెస్టులు, పోలీసుల ఆంక్షలు, అడుగడుగునా ఎదురైన అడ్డంకులను అధిగమించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉదయం 8 గంటలకు బయలుదేరిన తమను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంతో 3 గంటల్లో చేరుకోవాల్సిన ప్రయాణానికి మధ్యాహ్నం 3 గంటల సమయం పట్టిందని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా దగా పడ్డ తెలంగాణకు నీళ్లివ్వాలని కేసీఆర్ మహాయజ్ఞంలా కాళేశ్వరాన్ని నిర్మించారని, తాము ఇక్కడికి ఎవరినో నిందించడానికి లేదా రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరం
బాసర నుండి గోదావరి పారుతున్నా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎడారిలానే ఉండిపోయిందని, నీళ్ల కోసమే ఆనాడు ఉద్యమం చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. పల్లం నుంచి నీటిని పైకి తేవచ్చని, మనం కూర్చున్న చోట 90 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నాయని కాళేశ్వరం నిరూపించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు గతంలో తుమ్మిడిహట్టి దగ్గర కడతామని ప్రజలను మభ్యపెట్టారని, ఆనాడు మహారాష్ట్రకు 152 మీటర్ల ఎత్తు పెంచవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వమే లేఖ రాసిందని గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ జల దౌత్యం జరిపి, మూడున్నరేళ్లలో చర్యలు తీసుకుని, గోదావరిలో ఎప్పుడూ నీళ్లుండేలా కన్నెపల్లి దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారన్నారు. 22 ఏళ్లయినా పోలవరం పూర్తికాలేదని, కానీ కాలంతో పోటీ పడుతూ 80 మీటర్ల నుండి 110 మీటర్ల వరకు నీళ్లు ఎత్తేలా ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశామని చెప్పారు.
రూ. 400 కోట్ల పనులను చేయకుండా రాజకీయం
మొత్తం 141 టీఎంసీల సామర్థ్యం, 370 కి పైగా పిల్లర్లు ఉన్న ఈ భారీ ప్రాజెక్టులో ఒక బ్లాక్‌లో రెండు పిల్లర్లు కుంగితే ‘కూలేశ్వరం’ అంటూ కాంగ్రెస్ నేతలు కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు పిల్లర్లు కుంగిన ఘటనపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. రెండు పిల్లర్లు కుంగిన బ్లాక్ పునర్నిర్మాణానికి కేవలం రూ. 400 కోట్లు మాత్రమే అవుతుందని, అది కూడా ప్రభుత్వంపై ఒక్క పైసా భారం పడకుండా నిర్మాణ సంస్థే పూర్తి చేస్తానని చెప్పినా ప్రభుత్వం పనులు చేయడం లేదని ఆరోపించారు. రూ. 95 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని రేవంత్ రెడ్డి సొంత మామనే ప్రశ్నించినా, ముఖ్యమంత్రికి బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు.
చేతకాకపోతే కేసీఆర్‌కు అప్పగించండి.. లేదంటే ముట్టడిస్తాం!
ప్రస్తుతం కాళేశ్వరం దగ్గర 100 మీటర్ల ఎత్తులో నీళ్లు ఉన్నాయని, కన్నెపల్లి నుండి నీళ్లు తీసుకోవడానికి 93 మీటర్లు ఉంటే చాలని, అయినా ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు తీసుకోకపోవడం వల్లే హైదరాబాద్‌లో తాగునీటి కొరత ఏర్పడి 15 వేల ట్యాంకర్లు తిరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండాయని అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2014కు ముందు ఎందుకు ఇంత ధాన్యం పండలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ కూలినప్పుడు మీ అవినీతి వల్లే కూలిందని తాము అనలేదా అని ప్రశ్నించారు. రైతులకు నీళ్లిస్తే యూరియా ఇవ్వాలని, ధాన్యం కొని మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదన్నారు.
“కాళేశ్వరం ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఇచ్చిన వరం.. నీవు (ఉత్తమ్) శనేశ్వరం” అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీకు చేతకాకపోతే మా కేసీఆర్‌కు ఒక్క వారం రోజులు అప్పగించండి.. వారం రోజుల్లో నీళ్లు ఎత్తి చూపిస్తాం” అని సవాల్ విసిరారు. మేడిగడ్డ కాకుండా కన్నెపల్లి నుండి నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలని, ఎన్‌డీఎస్‌ఏ (NDSA) రిపోర్టులకు ఎలాంటి విశ్వసనీయత లేదని కొట్టిపారేశారు. ప్రభుత్వంపై కలిసికట్టుగా ఒత్తిడి తెచ్చి నీళ్లు ఎత్తేలా చేస్తామని, అప్పటికీ స్పందించకపోతే 50 వేల మందితో ప్రాజెక్టును ముట్టడించి, తామే స్వయంగా మోటర్లను ప్రారంభిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

