Komatireddy Venkat Reddy Interesting Comments: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్‌తో పాటు ఇచ్చిన ఇతర హామీలన్నింటినీ అమలు చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ దగ్గర తన అనుచరులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. నల్గొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు తన చిరకాల స్వప్నమని తెలిపారు. ఆలస్యంగానైనా ప్రాజెక్టు పనులు పూర్తిచేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా 10% పనులు మిగిలున్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాజకీయ భిక్ష పెట్టిన తన ప్రాంత ప్రజల రుణాన్ని తాను తీర్చుకున్నానని అన్నారు. ఈసారి తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నెలలో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీని తీసుకువస్తామని తెలిపారు.
UPSC CSE 2022: సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వేడుకల సందర్భంగానే సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేడుకలకి విచ్చేసిన ప్రజలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా.. తనని సీఎం అనొద్దని అన్నారు. తాను మంత్రి పదవినే వదిలేశానని, తనకు పదవి కాదు ప్రజలే ముఖ్యమని తెలిపారు. తనకు సీఎం పదవి అవసరం లేదన్న ఆయన.. ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని పేర్కొన్నారు. తాను ఏరోజూ పదవుల కోసం ఆశపడలేదని.. పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. తాను సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. మీకోసం (నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశిస్తూ) చావడానికైనా, చంపడానికైనా తాను సిద్ధమేనని.. ఐదు సార్లు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం ఎవరన్న అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. కాగా.. గతంలో ఓసారి దళిత అభ్యర్థినే సీఎం చేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక మలుపు