Komatireddy Rajagopal Reddy Comments On KCR: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. మునుగోడు నియోజకవర్గానికి కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను రాజీనామా చేయడం వల్లే, మునుగోడుకు ప్రభుత్వం కదిలి కదిలి వచ్చిందన్నారు. ఒకవేళ తాను రాజీనామ చేయకుంటే, మునుగోడు గురించి ఏ ఒక్కరూ మాట్లాడేవారు కాదని, ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే మునుగోడులో అభివృద్ధి పనులు చేసి ఉంటే, ఇప్పుడు ఇంత సైన్యం ఎందుకని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో తనను ఓడించేందుకు.. కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
అంతకుముందు.. తెలంగాణలో కుటుంబ పాలన మీద వస్తోన్న ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేకే తనపై కేసీఆర్, కేటీఆర్ చిల్లర్ ఆరోపణలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే.. బీజేపీ అందించే కాంట్రాక్ట్ పనులను పొందడం కోసమే బీజేపీలో చేరారని టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలకు సైతం గట్టి సమాధానం ఇచ్చారు. తాను ఇప్పుడిప్పుడే కొత్తగా కాంట్రాక్ట్ అవతారం ఎత్తలేదని.. టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు నుంచే కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నానని కౌంటర్ ఇచ్చారు. ఎప్పటి నుంచో తనకు దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ వ్యాపారాలున్నాయని.. కాంట్రాక్ట్ పనులు చేయడం తనకేమీ కొత్త కాదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ నేతల తీరు చూస్తోంటే.. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.