NTV Telugu Site icon

Komatireddy Rajagopal Reddy: 6 నెలల ముందే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు..! అప్పటి వరకు ఆగరు..

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి విక్టరీ కొట్టారు.. అయితే, ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని చెబుతూ వస్తున్నారు గులాబీ దళపతి.. ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలోనే అదే మాట చెప్పారు కేసీఆర్. అయితే, ఆయన మాటలకు అర్థాలువేరులే..! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్‌ లీడర్లు.. ఏదేమైనా మందస్తు ఎన్నికలు వెళ్లడమే కేసీఆర్‌ ప్లాన్‌ అంటున్నారు.. తాజాగా ముందస్తు ఎన్నికల ప్రచారంపై స్పందించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. 2023 డిసెంబర్ వరకు సాధారణ ఎన్నికలకు గడువు ఉండకపోవచ్చన్న ఆయన.. ఆరు నెలల ముందుగానే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తాడని జోస్యం చెప్పారు..

Read Also: Ponnala Lakshmaiah: కేసీఆర్‌కి ఎన్నికల రోగం.. అందుకే డ్రామాలు..!

ఇక, ఏప్రిల్, మే నెలలో కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్యానించారు.. ఈరోజు నుంచే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందన్న భయంతోనే కేసీఆర్‌ సర్కార్‌ పోలీసులను అడ్డుపెట్టుకుని బీజేపీ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజగోపాల్‌రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం.. ఆ తర్వాత మునుగోడ ఉప ఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగి ఓటమిపాలైన విషయం విదితమే.. ఈ ఎన్నికల్లో సిట్టింగ్‌ సీటును కాపాడుకోలేకపోయిన.. కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానానికి పరిమితం కాగా.. అధికార టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన విషయం విదితమే.. అయితే, మునుగోడులో బీజేపీకి అనూహ్యంగా ఓటుబ్యాంకు మాత్రం పెరిగింది.