Union Minister Kishan Reddy Made Comments on CM KCR.
కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీని చూస్తుంటే జాలేస్తుందని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రైతులను బలి చేస్తోందని ఆయన ఆరోపించారు. పుత్ర వాత్సల్యంతో బీజేపీపై కుట్ర చేస్తూ రైతులను ముంచుతున్నారని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ళపై రాజకీయం చేస్తున్నారని, చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యం కొనుగోలు చేస్తామని కేంద్రం చెప్తోందని, రైతు పండించేది ధాన్యం మాత్రమే….రైస్ మిల్లుల్లో రా రైస్..బాయిల్డ్ రైస్ గా మారుతాయన్నారు. “రా రైస్” పంపిస్తామని అంగీకరించారు కదా..!?అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రైతు వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నారని, పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించాయి..కేసీఆర్ ఎందుకు పన్ను తగ్గించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని, ఉక్రెయిన్ పరిణామాల కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల కేంద్రానికి నష్టం వస్తుందన్నారు. సైనిక స్కూల్, ఎంఎంటీఎస్, ట్రైబల్ మ్యూజియం సహా కేంద్రం ఇచ్చినవాటిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయొద్దని, కుటుంబ రాజకీయలకోసం తెలంగాణ రైతులను బలి చేయవద్దని ఆయన హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత ఆహార సంస్థ (ఏఫ్‌సీఐ) వడ్లను ఎక్కడా కొనదు.. బియ్యం మాత్రమే కొంటారని ఆయన వెల్లడించారు. ఆంధ్ర, తమిళనాడు, ఛత్తీస్ ఘడ్‌లో లేని సమస్య తెలంగాణకు ఎందుకు వస్తుందని ఆయన అన్నారు. చివరి బియ్యపు గింజ వరకు కేంద్రం కొంటుందని, రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలపై కేసీఆర్‌కి కంట్రోల్ లేనట్లు ఉందని ఆయన విమర్శించారు.
కేంద్రం బియ్యం కొనుగోలు చేయదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ధాన్యం సేకరణపై ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రైతులను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం సరఫరా చేస్తుందో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదని, హుజురాబాద్ ఎన్నిక అడ్డు పెట్టుకుని కుటుంబ ప్రతిష్ట నిలబెట్టు కోవాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. “బెంగాల్ మోడల్ “ ను కేసీఆర్ అవలంబించాలని అనుకుంటున్నారని, సమావేశానికి మా కేంద్రమంత్రి రమ్మన్నారు….పార్లమెంట్ లో ఉన్నాను, కాబట్టి రాలేకపోయాను, ప్రజలను, రైతులను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
