Kishan Reddy Fires On CM KCR Over Flexis Against PM Modi: తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా సరే.. ప్రధాని మోడీని అడ్డుకోలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణలో వెలసిన బ్యానర్లను ఉద్దేశించి.. బేగంపేట్‌లో నిర్వహించిన బీజేపీ సభలో కిషన్ రెడ్డి ఆ విధంగా వ్యాఖ్యానించారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి, ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కిరాయి మనుషులతో బ్యానర్‌లు కట్టి, మోడీని అడ్డుకోలేరన్నారు. ప్రధాని మోడీ మళ్లీ మళ్లీ తెలంగాణకు వస్తారని చెప్పారు.
రాష్ట్ర అధినేతగా ప్రధానిని స్వాగతం పలకాల్సింది పోయి.. ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తాము చూస్తున్నామని, ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసే నియంతృత్వ పాలన కొనసాగుతోందని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీఎంకి తెలంగాణ అభివృద్ధి పట్టదని, ఆయనకు కేవలం తన కుటుంబమే ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలకు విరుద్ధంగా సీఎం పాలన సాగుతోందన్నారు. ట్రైబల్ మ్యూజియంకి ఇప్పటివరకు కేసీఆర్ భూమి ఇవ్వలేదన్నారు. సైన్స్ సిటీకి కూడా ల్యాండ్ ఇస్తానని హామీ ఇచ్చి, దాన్ని మర్చిపోయారన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సహకరించకుండా అడ్డుకుంటోంది కేసీఆరేనని విమర్శించారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధాని అయ్యేదాకా ఎన్ని జాతీయ రహదారులు ఉండేవో.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమదేళ్లలోనే అందుకు రెట్టింపు రహదారుల్ని నిర్మించడం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైల్వే వ్యవస్థ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఎంత కాలం వరకు అధికారంలో ఉంటారో, అప్పటివరకూ రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ఆరోపణలు చేశారు. మహిళ అని చూడకుండా గవర్నర్‌ని సైతం అవమానిస్తున్నారని మండిపడ్డారు. తాము కల్వకుంట్ల కుటుంబానికి భయపడేదే లేదని, ప్రజల్లోనూ కేసీఆర్ పాలనపై నమ్మకం పోయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.