సీఎం కేసీఆర్ గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా.. పీఎంను దేశం నుండి తరిమేస్తా.. బీజేపీ నీ బంగళా ఖాతంలో కలిపేస్తానంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ నేను కలిసి దేశమంతా పర్యటిస్తా అన్నారు… ఫెడరల్ ఫ్రంట్ అన్నారు ముందు మీ పార్టీలో గుణాత్మక మార్పు రావాలి, కేసీఆర్ వ్యవహారంలో గుణాత్మక మార్పు రావాలి అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని, మోడీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు… కేసీఆర్ నెలకు 18 గంటలు పనిచేస్తారని ఆయన విమర్శించారు.
దేశంలో గుణాత్మక మార్పు వస్తుందో రాదో తెలియదు కానీ రాష్ట్రం లో మార్పు తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, బీజేపీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న పార్టీ అని ఆయన అన్నారు. మా పార్టీ అధ్యక్షుడిని మూడేళ్ల కోసారి ఎన్నుకుంటామని, మా పార్టీ తరవాత అధ్యక్షుడు నడ్డా కుమారుడు కాడు… ప్రధానిగా కూడా నరేంద్ర మోడీ కుటుంబం నుండి ఉండరు… మీ పార్టీలో ఆ స్థితి ఉందా… అంత ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.
ఇదేమన్నా రాజుల రాజ్యమా… కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణను ప్రజలు రాసిచ్చారా అని ఆయన మండిపడ్డారు. కుటుంబ పార్టీలకు, పాలనకు బీజేపీ వ్యతిరేకమన్న కిషన్‌రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబంకి నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందేమోననే శాపం ఉన్నట్టుంది ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం ఏమి చేయనిదే తెలంగాణ ముందుకు వెళ్తుందా.. గ్రామ పంచాయితీలకు కేంద్రం ఇచ్చింది ఎంత రాష్ట్రం ఇచ్చింది ఎంత చర్చకు కేసీఆర్ సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు.