కూరగాయల్లో అందరూ ఎక్కువగా వినియోగించే టమోటా ధర రికార్డు స్థాయిలో పెరిగింది. నెలరోజుల క్రితం రైతు బజార్లలో టమాటా రూ.10కి దొరికితే నేడు అక్కడే రూ.55కు అమ్ముతున్నారు. వారపు సంతల్లో అయితే కిలో టమోటా రూ.100కు విక్రయిస్తున్నారు. కూరగాయలు, పండ్లు అమ్మేందుకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌లో అయితే కిలో టమోటాను రూ.125 బోర్డు పెట్టి అమ్ముతున్నారు.
హైదరాబాద్ నగరంలో విక్రయించే టమోటాలు ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వస్తాయి. అయితే ఈ ఏడాది శ్రీలంక సంక్షోభంతో ఎక్కువగా టమోటాలు అక్కడకు ఎగుమతి అవుతున్నాయి. రోజు 50 ట్రక్కుల వరకూ తీరప్రాంతానికి చేరుకుని లంకకు ఎగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. 25 కేజీలున్న టమోటా ట్రే రూ.1300 నుంచి రూ.1400 వరకూ పంట పొలం దగ్గరే పలుకుతుండడంతో అక్కడి రైతులు మరో ప్రాంతం వైపు చూడటంలేదు. మరోవైపు టమోటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో బీన్స్ రూ.159, బీరకాయ రూ.120, బెండ రూ.120 పలుకుతున్నాయి. ఆయా కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్యులు ఆకుకూరలు, ఉల్లిగడ్డలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.