తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. ఈ వ్యవహారంలో ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.. డాక్యుమెంట్లు ఇస్తే.. విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.. దీంతో.. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐకి సూచించింది ధర్మాసనం.. ఇదే సమయంలో.. సీబీఐ వాదనలు కూడా వింటామన్న హైకోర్టు… తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది..
Read Also: Inter Board: ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం.. ఫీజు ఇలా చెల్లించాలి..
అయితే, హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో వాడివేడిగా వాదనలు సాగాయి.. ఇవాళ ఉదయం నుంచి జరిగిన వాదనల కంటే.. మధ్యాహ్నం తర్వాత తీవ్రంగా జరిగాయి.. బీజేపీ ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసిందని.. ఇతర పార్టీల్లో గెలిచిన ఎంపీలను, ఎమ్మెల్యేలను బలవంతంగా బీజేపీలో చేర్చుకుంటున్నారన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు లాయర్ దామోదర్‌రెడ్డి.. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని వాదించారు.. ఏ ఎమ్మెల్యేనూ కొలుగోలు చేయలేదన్న ఆయన.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేరాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావేనని పేర్కొన్నారు.. 2014 నుండి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారని హైకోర్టులో వాదనలు వినిపించారు లాయర్ దామోదర్ రెడ్డి.. ఇక, ఈ వాదన జరుగుతోన్న సందర్భంలో జోక్యం చేసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఇది బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య జరిగే గొడవలకు వేదిక కాదు.. ఏదైనా ఉంటే బయట చూసుకోవాలని స్పష్టం చేసింది.. ఈ కేసులో సోమవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.. సీబీఐ వాదనలు కూడా విననుంది హైకోర్టు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థిస్తుందా..? తీర్పు మరో రకంగా రానుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
