KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!

Kcr Meeting

Kcr Meeting

KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ , ముఖ్యంగా సభ్యత్వ నమోదు ప్రక్రియపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ వంటి ప్రక్రియలను పూర్తిగా డిజిటల్ విధానంలోనే నిర్వహిస్తున్న తరుణంలో, పార్టీ సభ్యత్వాన్ని కూడా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డిజిటలైజేషన్ పద్ధతిలోనే చేపట్టాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఈ సరికొత్త డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు ఒక పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేశారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మందికి డిజిటల్ మెంబర్‌షిప్ విధివిధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర కమిటీ నుండి ఒక సభ్యత్వ సమన్వయ కర్తను నియమించడంతో పాటు, వచ్చే రెండు మూడు రోజుల్లోనే మండలాలు , మున్సిపల్ బాడీల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ శిక్షణా శిబిరాలన్నీ పార్టీ ప్రధాన కార్యదర్శుల ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగనున్నాయి.

సభ్యత్వ నమోదు ప్రక్రియను జిల్లాల వారీగా సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేసీఆర్ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు తక్కళ్లపల్లి రవీందర్ రావును, కరీంనగర్ క్లస్టర్‌కు జీవన్ రెడ్డిని, వరంగల్ ప్రాంతానికి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇంచార్జీలుగా నియమించారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ బాధ్యతలను గ్యాదరి బాలమల్లుకు, నిజామాబాద్ జిల్లాను గంగాధర్ గౌడ్‌కు, అదిలాబాద్ ప్రాంతాన్ని రావుల శ్రావణ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్, నల్గొండ జిల్లాకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పర్యవేక్షకులుగా వ్యవహరించనున్నారు. ఈ భారీ కసరత్తు ద్వారా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.