Site icon NTV Telugu

KCR: చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే RDX బాంబులు పెట్టి పేల్చిండు

Kcr 4

Kcr 4

KCR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ, ముఖ్యంగా పాలమూరు జిల్లా పట్ల పాలకులు ప్రదర్శించిన వివక్షను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఎండగట్టారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు ఉన్నా నీరు లేక పాలమూరు జిల్లా ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు గొప్పలు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యమని కేసీఆర్ విమర్శించారు. “సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి” అనేది కేవలం ఒక స్లోగన్‌గా మాత్రమే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. జూరాల ప్రాజెక్టు వల్ల ముంపునకు గురైన కర్ణాటక ప్రాంతానికి చెల్లించాల్సిన కేవలం 13 కోట్ల రూపాయల పరిహారాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదని, తాను బహిరంగ సభల్లో తీవ్రంగా ప్రశ్నించిన తర్వాతే ఆ నిధులు విడుదలయ్యాయని గుర్తుచేశారు.

ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) విషయంలో జరిగిన ద్రోహాన్ని కేసీఆర్ వివరించారు. 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ కాలువను బాంబులు పెట్టి పేల్చివేసి, తెలంగాణ రైతులకు అందాల్సిన నీటిని అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ అన్యాయాన్ని లోకానికి చాటి చెప్పడానికే తాను జోగులాంబ నుండి గద్వాల వరకు మొదటి పాదయాత్ర చేపట్టానని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో జూరాల – ఆర్డీఎస్ లింక్ కెనాల్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరలేపారని, కానీ రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని విమర్శించారు.

జిల్లా మొత్తం 100 శాతం కృష్ణా బేసిన్‌లో ఉన్నప్పటికీ, భయంకరమైన కరువును అనుభవించాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నారు. ఈ దుర్భర పరిస్థితిని చూసే గోరేటి వెంకన్న వంటి కవులు “పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోన” వంటి గుండెలు పిండే పాటలు రాశారని చెప్పారు. ఈ పరిస్థితుల వల్లే ప్రజలు పొట్టచేత పట్టుకుని బొంబాయి వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని, ఉమ్మడి పాలకులు కావాలనే ఈ ప్రాంతాన్ని వెనకకు నెట్టివేశారని తాను వందల ఉపన్యాసాల్లో చెప్పిన మాటలు ఈ రోజు అక్షర సత్యాలుగా నిరూపితమయ్యాయని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఈ వివక్షకు ముగింపు పడిందని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version