పబ్లిసిటీ చెయ్యడంలో ముందుంటావు… కానీ, భారత్ జోడో యాత్రలో ఎందుకు వెనుక పడ్డావు అంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్. భారత్ జోడో యాత్రపై గాంధీభవన్‌లో జరిగిన సమీక్షలో ఈ కామెంట్స్ చేశారు కేసీ వేణుగోపాల్. జోడో ప్రచారంలో తెలంగాణ పీసీసీ వెనుకబడిందని కామెంట్ చేశారు. మరోవైపు.. రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసే వరకు తెలంగాణ విడిచిపోవద్దని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ను ఆదేశించారు. తమకున్న నివేదిక ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్న వేణుగోపాల్, భారత్ జోడో యాత్రను పాదయాత్రలా కాకుండా ఉద్యమంలా చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీతో సాయంత్రం జరిగే పాదయాత్రలో 50 వేలమందికి తక్కువ ఉండకుండా చూడాలని చెప్పారు. భారత్ జోడోకు విస్తృతమైన ప్రచారం చెయ్యాలన్నారు. రేపటి నుంచే గ్రామస్థాయికి వెళ్లేలా ప్రచారాన్ని మొదలుపెట్టాలని చెప్పారు కేసీ వేణుగోపాల్.
Read Also: Minister Seediri Appalaraju: పాదయాత్ర ఆపేయాలని అడుగుతాం.. ఆపకపోతే అడ్డుకుంటాం
ఇక, పాదయాత్రలో రాహుల్ గాంధీని కలిసేందుకు నాయకులు ఎవరూ ప్రయత్నం చేయొద్దు అని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్.. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసేవాళ్లను, ఉద్యమకారులను, సమస్యలతో బాధపడుతున్న వాళ్లను రాహుల్ గాంధీని కలిసేలా ప్లాన్ చేసుకోండి అని సూచించారు.. కాగా, కర్నాటక చిత్రదుర్గలో 36వ రోజు రాహుల్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఇందులో పార్టీ నేతలు డీకే శివకుమార్‌తో పాటు స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడక్కడ ఆగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నడక సాగిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 930 కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేసుకున్నారు రాహుల్. ఉదయం బొమ్మనగండన హళ్లి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర.. సాయంత్రం రాంపురాలో ముగిసింది. ఉదయం అక్కడి నుంచే మళ్లీ యాత్ర ప్రారంభించనున్నారు.