పోలీసులకు భయపడి ఓ వ్యక్తి పారిపోతూ బావిలో పడి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… జమ్మికుంటకు చెందిన పొనుగంటి వేణు అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో సరాదాగా స్నేహితులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వేణు తన స్నేహితులతో కలిసి హుజురాబాద్ రోడ్డులోని ఓ బారు సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో మద్యం సేవిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి పోలీస్ సైరన్ వినిపించడంతో వేణుతో పాటు అతడి స్నేహితులందరూ భయపడిపోయారు.
Read Also: భార్యపై అనుమానంతో కూతురిని బలి తీసుకున్న తండ్రి
దీంతో ఒక్కసారిగా వేణు, అతడి స్నేహితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దగ్గరలో ఉన్న బావిని గమనించని వేణు అందులో పడిపోయాడు. స్నేహితులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కాగా మృతుడు వేణుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనతో జమ్మికుంటలో విషాదం నెలకొంది. అయితే తన భర్త మృతిపై అనుమానాలు ఉండటంతో వేణు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.