Karimnagar : కరీంనగర్‌లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!

  • రాజకీయ ఘర్షణలతో కరీంనగర్‌లో ఉద్రిక్తత
  • గంగులపై వ్యాఖ్యలతో మరోసారి దుమారం
  • బండారి వేణు, బీఆర్‌ఎస్ నేతల అదుపులోకి
  • నగరంలో భారీగా పోలీసుల మోహరింపు
Karimangar

Karimangar

కరీంనగర్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రస్తుతం పోలీసు శాఖకు తీవ్ర సవాల్‌గా మారుతోంది. గత నాలుగు నెలలుగా నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్త సంఘటనలు, రాజకీయ పార్టీల విభేదాలు, దొంగతనాలు , వివాదాలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన నుంచి మొదలుకొని, సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువలరీ దోపిడీ వరకు వరుస నేరాలు పోలీసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర రాజకీయ వైషమ్యాలు తరచూ వీధి ఘర్షణలకు దారితీస్తుండటంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది.

మాజీ మంత్రి గంగులపై వ్యాఖ్యలతో దుమారం…

తాజాగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి కార్పొరేటర్ బండారి వేణు చేసిన తీవ్ర వ్యాఖ్యలు నగరంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండారి వేణు ఇంటిని ముట్టడించేందుకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ముట్టడికి యత్నించిన బిఆర్ఎస్ నేతలతో పాటు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కార్పొరేటర్ బండారి వేణును కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బండారి వేణు ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఏసీపీ వెంకటస్వామి స్వయంగా పర్యవేక్షిస్తుండగా, వరుస ఉద్రిక్తతల దృష్ట్యా నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.