Kadiyam Srihari : తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అయ్యాడు.?

  • మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు
  • కేసీఆర్‌ తెలంగాణకు ఎలా జాతిపిత అయ్యారు?
  • కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి
  • జాతిపిత ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు - కడియం
Kadiyam

Kadiyam

తెలంగాణ రాజకీయాల్లో ‘జాతిపిత’ అనే పదం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను ఆయన పార్టీ నేతలు ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. భారతదేశానికి జాతిపిత ఒక్కరేనని, ఆయన మహాత్మా గాంధీ అని.. అలాంటి మహనీయుడితో కెసిఆర్‌ను పోల్చడం గాంధీజీని అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. అసలు కెసిఆర్ కు జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఆయన అత్యంత ఘాటుగా విమర్శించారు.

నిజంగానే కెసిఆర్ జాతిపిత అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఎందుకు స్పందించడం లేదని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడాల్సిన ప్రతిపక్ష నేత, అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎక్కడ ఉన్నారని ఆయన నిలదీశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం సెంటిమెంట్‌ను వాడుకుని రాజకీయాలు చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వచ్చి వారి కష్టాలను తీర్చే ఉద్దేశం కెసిఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు.

గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని కడియం ఆరోపించారు. అందుకే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి, ఓటు వేయడానికి ఇష్టపడలేదని స్పష్టం చేశారు. “కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కూలిపోయేలా నిర్మించడమే కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి దివాళా తీయించారు. ఎన్నో స్కామ్‌లలో ఇరుక్కున్న నేతను జాతిపిత అని ఎలా పిలుస్తారు?” అని ఆయన నిప్పులు చెరిగారు.

అధికారం కోల్పోయినప్పటికీ బీఆర్‌ఎస్ నాయకుల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని కడియం దుయ్యబట్టారు. వారి అహంకారం, అహంభావం వల్లే ప్రజలు వారికి దూరమయ్యారని, ఇప్పటికైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారని, ఇది ఎవరి సొత్తు కాదని గుర్తు చేశారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ప్రవర్తించకపోతే భవిష్యత్తులో ప్రజలు మరింత గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

Delhi Meeting: ముగిసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం.. “ప్రజల తెలంగాణ” లక్ష్యం దిశగా చర్చలు!