K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..

  • కామారెడ్డి రైల్ రోకో కేసులో కవితకు కోర్టు సమన్లు
  • రేపు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని ఆదేశం
  • బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌తో నిర్వహించిన ఆందోళన
  • రైళ్ల రాకపోకలకు అంతరాయం.. 12 మందిపై కేసులు నమోదు
Kavitha

Kavitha

K Kavitha : టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు రైల్వే కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. గతంలో కామారెడ్డిలో నిర్వహించిన రైల్ రోకోకు సంబంధించి నమోదైన కేసు విచారణలో భాగంగా, రేపు ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆమెను ఆదేశించింది.

బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కవిత ఆధ్వర్యంలో గతంలో కామారెడ్డిలో భారీ ఎత్తున రైల్ రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ బిల్లులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా దేవగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఒక గూడ్స్ రైలును నిలిపివేయడంతో నిజామాబాద్–హైదరాబాద్ రూట్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్‌పై నిరసనలు తెలపడం, రైళ్లను నిలిపివేసి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినందుకు గానూ కవితతో పాటు మరో 12 మంది నాయకులపై రైల్వే చట్టం (Railway Act) 147, 74(a) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో కోర్టు సమన్లు జారీ చేసింది.