కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒప్పందాలు తెలంగాణ రైతాంగం పాలిట శాపంగా మారాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన, కృష్ణా జలాల కేటాయింపులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావుల వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీలో చర్చకు రాకుండా పారిపోవడం వెనుక వారి బండారం బయటపడుతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఏ ఉద్దేశంతో సంతకం చేశారని జూపల్లి ప్రశ్నించారు. “తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగింది. అన్నీ తెలిసిన మేధావిని అని చెప్పుకునే కేసీఆర్, మన వాటాగా రావాల్సిన 500 టీఎంసీలకు పైగా జలాలను వదిలేసి, తక్కువ నీటికే ఎందుకు ఒప్పుకున్నారు?” అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు.
హరీష్ రావు మాట్లాడుతున్న మాటల్లో ఏమాత్రం పొంతన లేదని జూపల్లి ఎద్దేవా చేశారు. ఒకసారి 50:50 నిష్పత్తి అని, మరోసారి 69 శాతం వాటా అని, తీరా చూస్తే 299 టీఎంసీల ఒప్పందానికి అంగీకరించారని.. ఇలా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరు, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు ఆహ్వానించినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు సభను బహిష్కరించడం వారి పిరికితనానికి నిదర్శనమని జూపల్లి అన్నారు. “చర్చకు వస్తే వాస్తవాలు ఆధారాలతో సహా బయటపడతాయి. 30 ఏళ్ల రికార్డులు సమర్పించడంలో మీరు చేసిన విఫల యత్నాలు, కేంద్రం అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పలేకపోయిన సమాధానాలు బట్టబయలవుతాయి. అందుకే బండారం బయటపడతదనే భయంతోనే మీరు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులను, నిధుల కేటాయింపులను ప్రస్తుతం తమ ప్రభుత్వం సరిదిద్దుతోందని జూపల్లి తెలిపారు. కనీసం 45 టీఎంసీల వినియోగం విషయంలోనైనా స్పష్టమైన క్లియరెన్స్ తెచ్చుకుని, పాలమూరు ఎత్తిపోతల పనులను వేగవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదాలను సరిదిద్ది తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
Sarfaraz Khan: దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదుగా.. పాపం సర్ఫరాజ్ ఖాన్!