Ponguleti, Jupally: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కర్ణాటకలో అనూహ్యమైన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కొంత ప్రభావం చూపనుంది. మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో టీ కాంగ్రెస్ సభ్యత్వం కూడా పెరగనుంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
గత కొంత కాలంగా ఏ పార్టీలో చేరాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని జూపల్లి, పొంగులేటి కర్ణాటక ఎన్నికల ఫలితంతో దూకుడు పెంచారు. సేవ్ వనపర్తి పేరుతో నేడు నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి, పొంగులేటి హాజరుకానున్నారు. ఈ భేటీలో వీరిద్దరూ తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరికపై ప్రకటన చేస్తారని అంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ రోజైన జూన్ 2న తెలంగాణ కాంగ్రెస్ గూటికి చేరాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పొంగులేటిని కలిసిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరాలని పొంగులేటిని కోరారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి కాషాయ నేతలకు చెప్పారు. ఖమ్మంలో బీజేపీ బలం లేని కారణంగా పొంగులేటి ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉండడం, కర్ణాటక విజయంతో రాష్ట్రంలో పుంజుకునే అవకాశం ఉండడంతో పొంగులేటి, జూపల్లి హస్తం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ బలం పెరుగుతుంది. ఏది ఏమైనా ఎట్టకేలకు పొంగులేటి, జాపల్లి చేతులు కలుపుతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
LB nagar flyover: ఫ్లైఓవర్ పై ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం.. మాటల్లో పెట్టి కాపాడిన కానిస్టేబుల్