పదవ తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ ఖచ్చితంగా బీజేపీ బండి సంజయ్ కుట్ర అని ఆరోపించారు ఎమ్మెల్యే జోగురామన్న. ఆయన ఇవాళ ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీ కార్యకర్త అని, పార్టీ కార్యకర్తనా కాదా, సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నారా లేదా అన్న ప్రశ్నకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ సభ్యత్వాన్ని సైతం రద్దు చేయాలని, చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని జోగు రామన్న సవాల్ చేశారు. పేపర్ లీక్ అయిన రెండు గంటల్లో 140 సార్లు బీజేపీ నేతలకు ప్రశాంత్ ఫోన్ చేశారన్నది సాక్షాలతో సహా రుజువవుతోందని ఆయన అన్నారు. కేంద్రం ఆడిస్తున్న ఆటలను ఇక్కడ నేతలు ఆడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read : SSC Exam Paper Leak : ఏ1 గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇటువంటి పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని రామన్న వ్యాఖ్యానించారు. గ్రూప్ వన్ లీకేజీ లో కీలకంగా ఉన్న వ్యక్తి సైతం బీజేపీ కి చెందిన వ్యక్తే అని, దిగజారుడు రాజకీయాలు చేస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలోనూ యువతను తప్పుదోవ పట్టించేలా ప్రసంగాలు చేశారని, ఇప్పటికైనా బండి సంజయ్ తప్పు ఒప్పుకోవాలన్నారు. ఈ సంఘటనతో ఎందరో మంది విద్యార్థులు మనస్థాపానికి గురవుతున్నారని, అధికారం కోసం తప్పుడు నాటకాలు ఆడుతున్నారని జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Padma Awards 2023: ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం.. పద్మశ్రీ అందుకున్న కీరవాణి
