ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ములాయం కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఆధ్యాత్మిక రంగంలో సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారాన్ని చిన్నజీయర్ స్వామి అందుకున్నారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధా మూర్తికి సామాజిక సేవ రంగంలో పద్మభూషణ్‌తో సత్కరించారు.
Also Read:Kim Sharma: ‘ఖడ్గం’ బ్యూటీ ఎఫైర్స్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు..?
నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి.. కళా రంగంలో సేవలకు పద్మ శ్రీ వరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు. మిల్లెట్ మ్యాన్ ఖాదర్ వలి కూడా పద్మశ్రీ అందుకున్నారు. విజ్ఞాన రంగంలో సేవలకు ప్రొఫెసర్ నాగప్ప గణేష్, అబ్బా రెడ్డి రాజేశ్వర్ రెడ్డిలు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఇక, సినీ నటి రవీనా టాండన్ కూడా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. సూపర్ 30 ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ ప్రెసిడెంట్ ముర్ము నుండి పద్మశ్రీ అందుకున్నారు. ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘సూపర్ 30’ తెరకెక్కింది. కాగా, పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, ప్రధాని,కేంద్రమంత్రులు,లోక్ సభ స్పీకర్ పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ వేడుకకు కీరవాణి,రాజమౌళి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Also Read:Kim Sharma: ‘ఖడ్గం’ బ్యూటీ ఎఫైర్స్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు..?
ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 106 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్ మరియు 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు ఉన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో రాష్ట్రపతి ముర్ము 2023 పద్మ అవార్డులను ప్రదానం చేశారు.
పద్మ అవార్డులు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954లో స్థాపించబడిన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళ, సాహిత్యం, విద్య వంటి అన్ని రంగాలు/విభాగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు/సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డుకు ఎంపిక చేస్తారు. క్రీడలు, వైద్యం, సోషల్ వర్క్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మొదలైనవి రంగాలకు చెందిన వారిని పద్మ అవార్డులకు ఎంపిక చేస్తారు.