NTV Telugu Site icon

jeevitha rajasekhar: బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీవిత రాజశేఖర్.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ

Jeevitha Rajasekhar

Jeevitha Rajasekhar

jeevitha rajasekhar:తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకు తగ్గట్లుగా కేంద్ర మంత్రులు, కీలక నేతలు తరుచుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర కూడా పూర్తయింది. అయితే రానున్న రోజుల్లో మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. దీని కోసం పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కీలక నేత బీజేపీలో చేరారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి.

చేరికల కమిటీ చైర్మన్ గా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను నియమించి పార్టీలో చేరికను ఉండేలా చూస్తోంది బీజేపీ. ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్ కూడా ఇటీవల బీజేపీ పార్టీలో చేరారు. అయితే ఇప్పటి వరకు పలు పార్టీల్లో పనిచేసిన జీవిత రాజశేఖర్ ఎప్పుడూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఏ పార్టీలో కూడా నిలకడగా లేరు. అయితే ఇప్పుడు ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుని.. ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గ ఇంఛార్జుగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. మహిళ ఇంఛార్జుగా ఉన్న నియోజకవర్గంలో మరో మహిళ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2024లో జహీరాబాద్ నుంచి జీవిత రాజశేఖర్ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Read Also: Errabelli Dayakar Rao: బతుకమ్మ చీరలను కాల్చితే కఠిన చర్యలు

ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు కూడా మొదలుపెట్టారు జీవిత రాజశేఖర్. తెలంగాణకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ప్రతీ క్లబ్, పబ్ లో మంత్రి కేటీఆర్ కు వాటాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా.. జహీరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన బీబీ పాటిల్ ఎంపీగా ఉన్నారు. 2008లో ఏర్పడిన జహీరాబాద్ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సురేష్ కుమార్ షెట్కర్ గెలుపొందారు. ఆ తరువాత 2014,2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ గెలుపొందారు. 2019లో ఈ నియోజకవర్గంలో బీజేపీ మంచి ఓట్లను సాధించింది. 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేస్తే 1,38,947 సాధించి మూడోస్థానంలో నిలిచారు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి.