Kaleswaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. కాళేశ్వరంలో కొలువైన త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర నదిలో దీపాలను వదిలి పెడుతున్నారు.
అయితే, పవిత్ర స్నానాల తర్వాత భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానిక తరలి వెళ్తున్నారు. అక్కడ స్వామివారికి భక్తిశ్రద్ధలతో మారేడు దళాలు సమర్పించి, ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు చేస్తున్నారు. అలాగే, శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భక్తులు లక్ష చుక్కల ముగ్గు వేసి, దీపాలు వెలిగించి, దీప దానం చేసి, ప్రదక్షిణలు చేశారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్ పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు.