Site icon NTV Telugu

Warangal: కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్.. ఎమ్మెల్యే కౌంటర్

Thatikonda Rajaiah

Thatikonda Rajaiah

మాజీ ఉపముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలతో స్టేషన్ ఘనపూర్‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. 13 నెలల్లో నియోజకవర్గానికి ఏం చేశావని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రూ.1000 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కడియం కౌంటర్ ఇచ్చారు.

Read Also: Chhattisgarh: భారీ ఎన్‌కౌంటర్‌.. 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం కక్ష సాధింపు చర్యలు, కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు.. టీడీపీలో ఉన్నప్పుడు అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు చేశారని దుయ్యబట్టారు. దౌర్జన్యాలు చేస్తూ ఎందరినో ఎన్‌కౌంటర్లు చేయించాడు. ఈ ఆరు నెలల్లో ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టించాడు. స్టేషన్ ఘనపూర్ ప్రజలను నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తాడని కడియంను గెలిపించారు.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు అక్కరకురాని వాడయ్యాడని మండిపడ్డారు. కుక్కిన పేనులా ఉండకుండా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితలను తిడుతున్నాడు.. కడియం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా, నైతిక విలువలు లేకుండా గెలిచిన పార్టీకి, పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారాడు.. తగదునమ్మా అని అభివృద్ధి కోసం అంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నాడు.. 13 నెలలు అయింది, ఇచ్చిన హామీలు ఏవని కడియం శ్రీహరిని ప్రశ్నించారు.

Read Also: Andhra University: ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల పేరిట మోసం కేసులో కొత్త ట్విస్ట్..

తాడికొండ రాజయ్య వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిట్టనివారు ఘనపూర్‌లో అభివృద్ధి ఏం జరగలేదని మాట్లాడుతున్నారు. చేతగానివారు, చేవలేని, అవినీతి పరులు ఇప్పుడు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఘనపూర్ నియోజకవర్గానికి నిధులు వచ్చాయి.. ఘనపూర్‌ను మున్సిపాలిటీ చేసుకున్నామని అన్నారు. రూ.800 కోట్ల నిధులకు ఉత్తర్వులు వచ్చాయి.. మరో 200 కోట్లకు ఉత్తర్వులు రావాలని తెలిపారు. మొత్తంగా 13 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ఘనపూర్‌కు రూ.1000 కోట్ల నిధులు వచ్చాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నాయకులు చవకబారు విమర్శలు చేస్తున్నారు.. నా ఎజెండా అభివృద్ధి, ఎవరెన్ని మాట్లాడినా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని కడియం శ్రీహరి అన్నారు. రాజయ్య 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి.. పదేళ్లు ప్రభుత్వం ఉన్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోయారని ఆరోపించారు. వాళ్ళు ఈ రోజు నాపై చవకబారు మాటలు మాట్లాడుతున్నారు.. అభివృద్ధి పక్కనబెట్టి ఎలాంటి సోకులు పడ్డారో తెలుసని విమర్శించారు. ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజలకు ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సహకారం కోసం పార్టీ మారానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Exit mobile version