Jagga Reddy : బీఆర్‌ఎస్‌ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!

  • కేసీఆర్, హరీష్‌కు క్షమాపణ డిమాండ్
  • కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్
  • ఈటెల రాజేందర్‌పైనా విమర్శలు
  • తుంగతుర్తి వివాదంపై స్పందన
Jaggareddy

Jaggareddy

Jagga Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు , సాగునీటి అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి ప్రధాన కారణమైన కేసీఆర్, హరీష్ రావులు ముందు తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసి, రాష్ట్రానికి భారీ నష్టం చేకూర్చినందుకు గానూ ముక్కు నేలకు రాసి, ఆ తర్వాతే ఇతర విషయాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు.

హరీష్ రావుకు రక్తం చిందించే ధైర్యం లేదు

రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోస్తామంటూ కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను జగ్గారెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. హరీష్ రావును రక్తం చిందించమని చెప్పినా ఆయన ఆ పని చేయరని, అసలు రక్తం చిందించే అంత ధైర్యం హరీష్‌కు లేదని ఎద్దేవా చేశారు. “తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎంతోమంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. ఆ సమయంలో హరీష్ రావు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు డ్రామా ఆడాడు కానీ.. అగ్గిపెట్టె మాత్రం తెచ్చుకోలేదు. పెట్రోల్ తెచ్చుకున్న వాడు అగ్గిపెట్టె తెచ్చుకోలేడా?” అంటూ జగ్గారెడ్డి తీక్షణమైన ప్రశ్నలు సంధించారు. తమకు నచ్చినట్టు నడుచుకోకపోతే అవతలి వారిని సైకోలు అంటారా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదో ఒక రకంగా నిందించాలనే ఒకే ఒక్క లైన్ పెట్టుకుని హరీష్ రావు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సమాజంలో హింసకు, రెచ్చగొట్టే స్వభావానికి కేసీఆర్ ఇల్లే కేరాఫ్ అడ్రస్ అని, ఆ లక్షణాలు వారి కుటుంబానికే చెల్లుతాయని ఆరోపించారు.

బీజేపీ నేత ఈటెలకు చురకలు

కాళేశ్వరం పునరుద్ధరణ విషయంలో ఎన్‌డీఎస్ఏ (NDSA) నిపుణుల కమిటీ ఏం చెబితే అది చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నేరుగా ఎన్‌డీఎస్ఏ దగ్గరికే వెళ్లి తేల్చుకుందాం రమ్మంటే హరీష్ రావు నుండి ఎలాంటి స్పందన లేదని నిలదీశారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌పై కూడా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో ఈటెల ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టే, ఇప్పుడు లోపాయికారీగా బీఆర్‌ఎస్ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “నువ్వు ఇప్పుడు బీజేపీలో కీలకమైన పదవిలో ఉన్నావు కదా.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేసీఆర్, హరీష్ రావులను ఢిల్లీకి తీసుకువెళ్లు. మా కాంగ్రెస్ మంత్రులు కూడా వస్తారు. అంతేకానీ అది చేయకుండా ఇక్కడ వృధాగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అని ఈటెలకు హితవు పలికారు. రైతులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, మాట ఇస్తే నిలబెట్టుకోవడం తమ రాజకీయ సంస్కృతి అని, అది బీఆర్‌ఎస్, హరీష్ రావుల సంస్కృతి కాదని స్పష్టం చేశారు.

తుంగతుర్తి పంచాయితీపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిన తుంగతుర్తి నియోజకవర్గ పంచాయితీపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. ప్రస్తుతం తుంగతుర్తి వ్యవహారానికి సంబంధించిన పోస్ట్‌మార్టం (పరిశీలన) జరుగుతోందని, అక్కడ తలెత్తిన సమస్యలను ఎలా సెట్ చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో కోపతాపాలు సహజమని, నియోజకవర్గానికి చెందిన అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నామని చెప్పారు. దీనిపై రేపటికల్లా తుది నివేదిక (రిపోర్ట్) సిద్ధం చేసి పార్టీ అధిష్టానానికి అందజేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పంచాయితీలు, గొడవలు రావడం చాలా సహజమని, “పంచాయితీలు అంటేనే కాంగ్రెస్” అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ గొడవలు ఉంటాయని, కాకపోతే తమ పార్టీ వాళ్లు ఏమైనా ఉంటే బహిరంగంగా బయట మాట్లాడతారని, మిగిలిన పార్టీల నేతలు మాత్రం లోపల మాట్లాడుకుంటారని.. కేవలం ఆ ఒక్కటే తమకు, మిగతా వారికి ఉన్న తేడా అని జగ్గారెడ్డి వివరించారు.