తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న పాలనపై, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలపై ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలను పక్కనబెట్టేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో స్కామ్‌లు తప్ప స్కీమ్‌లు లేవని విమర్శిస్తూ.. ముఖ్యంగా ‘కుసుమ్’ పథకంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ఈ స్కామ్‌లో కొందరు పెద్దల పేర్లు వినపడుతున్నాయని, దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై స్పందిస్తూ.. పీసీసీ చీఫ్ పదవికి ఎసరు పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్ సీఎం’
మెట్రో ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనంటూ చేస్తున్న ప్రచారాన్ని జగదీష్ రెడ్డి తిప్పికొట్టారు. నిజానికి మెట్రో విషయంలో బీజేపీ , ‘హైబ్రిడ్ కాంగ్రెస్’ ఒక్కటయ్యాయనే విషయం స్పష్టంగా తేలిపోయిందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీతో జట్టు కట్టారని విమర్శించారు. చంద్రబాబు, మోదీ ఆలోచనల నుండి పుట్టిన ఒక క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ సీఎం ప్రస్తుతం రాష్ట్ర పాలన సాగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ, జాతీయ బ్యాంకులను భయపెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేయబట్టే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఇతర కేంద్ర మంత్రులతో రేవంత్‌కు సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి పీఏ (పర్సనల్ అసిస్టెంట్) లాగా పని చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలకు ప్రభుత్వం ఎందుకు అంతలా భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందన
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయడంపై జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడైనా తమ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. ఇందులో కొత్తగా ఆఫీస్ పెట్టడం ఏముందని, ఆయన ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నారు కదా అని గుర్తుచేశారు. గతంలో తెలంగాణ వచ్చినందుకు నిరసనగా 11 రోజులు అన్నం తినకుండా పవన్ కళ్యాణ్ చేసిన దీక్ష కూడా తెలంగాణలోనే జరిగిందని పేర్కొన్నారు. ఇక్కడి తిండితోనే వాళ్ల శరీరం నిర్మాణం అయిందని వ్యాఖ్యానించారు. చివరగా.. పవన్ కళ్యాణ్, మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. వీరందరూ ఒకే కూటమిగా, ఒక్కటిగానే పనిచేస్తున్నారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

