హైదరాబాద్‌లో ఐటీ రంగం శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు తమ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగర నలుమూలల విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ కంపెనీలను నగరానికి అన్ని దిశల్లో విస్తరించేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా నేడు మంత్రి కేటీఆర్ ఉప్పల్‌లో జెన్‌పాక్ట్ క్యాంపస్‌కి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఒక ప్రాంతానికి ఐటీ పరిమితము కాకూడదని మా ప్రభుత్వం వచ్చాక ఐటీ పాలసీ తీసుకు వచ్చామని ఆయన వెల్లడించారు.
ఐటీ రంగాన్ని వెస్ట్ హైదరాబాద్ నుంచి నగరం నలు వైపులా విస్తరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఉండే ఐటీ ఉద్యోగులుకి మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. వెస్ట్ హైద్రాబాద్ కి ధీటుగా ఈస్ట్ హైద్రాబాద్ కూడా ఐటీ రంగంలో ఎదుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉప్పల్‌లో త్వరలో ఐపీఎల్ మ్యాచ్ లు కూడా స్టార్ట్ అయితే మరింత అభివృద్ధి చెందుతుందని, వరంగల్‌లో కూడా జెన్ పాక్ట్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు.
