IT Officials Opens Marri Rajasekhar Reddy Lockers With Help Of His Daughter: తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధవులు ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ లాకర్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. 8 బ్యాంకుల్లో 12 లాకర్లు ఉన్నాయని గుర్తించిన అధికారులు.. వాటిని తెరిచేందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయరెడ్డిని తీసుకెళ్లారు. ఇప్పటికే నాలుగు లాకర్లు తెరవగా, మిగిలిన లాకర్లను తెరవనున్నారు. తొలుత శ్రేయను సాయంత్రం కోటిలోనీ ఎస్‌బీఐ బ్యాంక్‌కి తీసుకెళ్లారు. ఆ బ్యాంక్‌లో మర్రి రాజశేఖర్ రెడ్డి లాకర్లున్నాయని తెలిసి, శ్రేయని అక్కడికి తీసుకెళ్లి, నాలుగు లాకర్లు ఓపెన్ చేయించారు. అనంతరం బోయన్‌పల్లిలో ఉన్న ఇంటికి శ్రేయని తిరిగి తీసుకొచ్చారు. అయితే.. శ్రేయను ఇంటికి తీసుకొస్తున్న సమయంలో, లేడీ కానిస్టేబుల్ లేకుండా శ్రేయను బయటకు ఎలా తీసుకెళ్లారంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. శ్రేయను తమతో మాట్లాడించాలని డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా.. మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు రెండో రోజూ తమ సోదాల్ని కొనసాగిస్తున్నారు. 200 మందికి పైగా అధికారులు, సిబ్బంది.. 50 బృందాలుగా వీడిపోయి ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకూ ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు ఆసుపత్రులు, ఆయా సంస్థల కార్యాలయాలు, డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లల్లోనూ తనిఖీలు సాగుతున్నాయి. అటు.. మల్లారెడ్డి స్నేహితుల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు.. ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లించాలి, ఇప్పుడు చెల్లిస్తున్నారనే విషయాలపై లెక్కలు చూస్తున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు.. కొన్ని కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు.. ఐటీ సోదాలు జరుగుతుండగానే ఇంటి నుంచి బయటకొచ్చిన మల్లారెడ్డి, ఐటీ సోదాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అన్ని అకౌంట్లు క్లియర్‌గానే ఉన్నాయని, వాళ్ల పని వాళ్లు చేసుకుంటారని వెల్లడించారు.