IPL Block Tickets Mafia : హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌ను క్యాష్ చేసుకునేందుకు కేటుగాళ్లు తెగబడ్డారు. స్టేడియం పరిసరాల్లో, ముఖ్యంగా గేట్ నంబర్ 2 వద్ద బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమైనప్పుడే సిండికేట్‌గా మారి భారీగా టికెట్లు కొనుగోలు చేసిన ముఠాలు.. ఇప్పుడు మ్యాచ్ క్రేజ్‌ను వాడుకుంటూ సామాన్య అభిమానులను నిలువునా దోచుకుంటున్నాయి. అసలు ధర రూ. 1,000 గా ఉన్న సాధారణ టికెట్లను బ్లాక్‌లో రూ. 10 వేల నుండి రూ. 20 వేల వరకు అమ్ముతుండగా, రూ. 10 వేల విలువైన VIP కార్పొరేట్ బాక్స్ టికెట్లను ఏకంగా రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు విక్రయిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
తమ ఫేవరెట్ స్టార్ క్రికెటర్లను చూసేందుకు స్టేడియం వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానుల అవసరాన్ని ఈ కేటుగాళ్లు పెట్టుబడిగా మార్చుకున్నారు. గేట్ నంబర్ 2 వద్ద విపరీతమైన రద్దీ ఉండటాన్ని ఆసరాగా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ బ్లాక్ దందాపై సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్టేడియం పరిసరాల్లో మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించి నిఘా తీవ్రం చేశారు. అభిమానులను మోసం చేస్తూ బ్లాక్ టికెట్లను విక్రయించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని, ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు.
