పోచంపల్లి చేనేత కళాకారులు నిలువు పేకల మగ్గంపై నేసిన చేనేత కళాఖండాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పోచంపల్లి చేనేతకే కాకుండా ఈ ప్రాంతం భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది. అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. చేనేతల్లో మొదటగా పేటెంట్ హక్కు పొందడం ఈ ప్రాంతం ప్రత్యేకత.
ఇక్కత్ పట్టు వస్ర్తాలను ఉత్పత్తి చేస్తున్న చేనేత కళాకారులు.. ఆ వృత్తిపై ఆధారపడిన కార్మికులకు చేయూతనిచ్చి.. పర్యాటకులను ఆకట్టుకోవడానికి పథకాలను రూపొందిస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. ఇక్కత్ చేనేతకు మరింత ప్రోత్సాహాన్నిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. పోచంపల్లి ప్రాంతాన్నిప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, షిర్డికీ త్వరలో టీడీసీ స్లీపర్ కోచ్ బస్సులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.