Generative AI: అమెరికన్ కార్నర్ హైదరాబాద్ సహకారంతో మహిళల కోసం సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో నిర్వహించిన జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI Bootcamp లో సీనియర్ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ సుధాకర్ రెడ్డి ఉడుముల ఒక శక్తివంతమైన సందేశాన్ని అందించారు..!! ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ అనేది సరైన సమాచారం మాత్రమే ఇస్తుందని చెప్పలేము. తప్పుడు వార్తలను సృష్టించడానికి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించవచ్చు. ఇది ప్రపంచాన్ని మంచి వైపు తీసుకుని వెళ్లే అవకాశం ఉంది లేదా విధ్వంసానికి కూడా దారితీయవచ్చని సుధాకర్ రెడ్డి ఉడుముల అన్నారు. భవిష్యత్తులో డిజిటల్ టూల్స్ పై అధికంగా ఆధారపడటం వల్ల, మనిషి మానసిక మేథో శక్తి పూర్తిగా క్షీణించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ విషయంలో ఎన్నో చట్టపరమైన సవాళ్లు కూడా ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉందని సుధాకర్ రెడ్డి ఉడుముల కోరారు.
జనరేటివ్ ఏఐ రంగం వేగంగా మారుతోంది:
జర్నలిజం, విద్య, హెల్త్ కేర్ వంటి రంగాల మీద జనరేటివ్ ఏఐ ప్రభావం గురించి జనవరి 6,7 వ తేదీల్లో నిర్వహించిన వర్క్ షాప్ లో సుధాకర్ రెడ్డి ఉడుముల వివరించారు. అలాగే ఈ Bootcamp లో యశోద హాస్పిటల్స్ కి చెందిన ప్రముఖ సర్జికల్ ఆంకాలజీ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ చినబాబు సుంకవల్లి కూడా పాల్గొన్నారు. డేటా ఆధారిత డయాగ్నొస్టిక్స్, సర్జరీ లలో ఏఐ ఉపయోగాలను వివరించారు.
సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమా జోసెఫ్, అమెరికన్ స్పేస్ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ ఎంఎస్ మెలిస్సా ఈ ఈవెంట్ ను ప్రారంభించి, అత్యాధునిక నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడంలో ఏఐ సామర్థ్యాన్ని వివరించారు. కంటెంట్ క్రియేషన్, కోడ్ జనరేషన్, నో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ వంటి వాటిపై కూడా ఈ వర్క్ షాప్ లో చర్చించారు. Generative AI Bootcamp లో మానవ పర్యవేక్షణ, జవాబుదారీతనం వంటి అంశాలను సుధాకర్ రెడ్డి ఉడుముల వివరించారు. నూతన ఆవిష్కరణలు, సామాజిక శ్రేయస్సు కోసం ఈ బూట్ క్యాంప్ ను నిర్వహించారని సుధాకర్ రెడ్డి ఉడుముల అన్నారు.