SC Classification: ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీకి, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ కొనసాగింది. ఈ మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ తో పాటు కమిటీ వైస్ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదికను ఏక సభ్య కమిషన్ అందజేసింది. ఆగస్టు 1వ తేదీ, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
అయితే, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అధ్యయనం కోసం రాష్ట్ర సర్కార్ 2024 అక్టోబర్ 11న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమించింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి తుది నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వాలని సూచించింది. దీంతో అధ్యయనం పూర్తి చేసిన కమిషన్ ఈరోజు సబ్ కమిటీకి రిపోర్టును అందజేసింది. ఇక, రేపు (ఫిబ్రవరి 3న) జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది.
ఇక, కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు రాత్రి 7 గంటలకు తిరిగి మరోసారి సమావేశం కానుంది. సచివాలయంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో మళ్లీ సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, మంగళవారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాల్సిందే.