NTV Telugu Site icon

Ponnam Prabhakar: బీసీలకు 42 శాతం రిజర్వేషన్.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయం..

Ponnam

Ponnam

Ponnam Prabhakar: బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలకు శుభ సూచిక.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భారత్ జోడో యాత్రలో దేశంలో ఉన్న అసమానతలు గుర్తించిన రాహుల్ గాంధీ ఎవరెంతో వారికంత అనే నిర్ణయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.. కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో ఆ నిర్ణయం అమలు చేయలేకపోయింది అని ఆయన వెల్లడించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ కులగణన చేసి ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాం.. ఒక సంవత్సరం తరువాత మార్చి 17వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించిన కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేసేందుకు కేంద్రానికి బిల్లును పంపి.. ఏకగ్రీవంగా ఆమోదించేలా చూస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Read Also: PM Modi: మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. ఉగ్రవాదం, భద్రతా అంశాలపై చర్చ

ఇక, బీసీ మెదవుల ఆలోచనను అమలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం తెలిపారు. రాహుల్ గాంధీ సారథ్యంలో పార్లమెంట్ లో అన్ని పార్టీల మద్దతుతో ఈ బిల్లు ఆమోదంపై మా ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం.. రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 9లో పెట్టే బాధ్యతను మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి సాధించుకునే దిశగా వెళ్తామన్నారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ సహకారంతో ఈ 42 శాతం సాధిస్తామని దృఢ విశ్వాసంతో ఇవాళ ఈ బిల్లు పాస్ చేసుకున్నాం.. ఈ బిల్లుకు సహకరించిన అందరికీ మరొక సారి ధన్యవాదాలు అని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.