Off The Record: తెలంగాణలో అధికారమే తదుపరి లక్ష్యం అంటూ గట్టిగా ప్లాన్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకోసం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పట్నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందనగానే.. పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతోంది కమలం టీమ్. పార్టీ బలోపేతం, ప్రజాదరణను ఏకకాలంలో సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే… తాము బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు కమలనాధులు. మరీ… ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సింగరేణికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తరించి ఉందీ సంస్థ. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేయగలిగే సత్తా ఉంది సింగరేణి కార్మికులకు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లు ఇక్కడ కీలకం. ఆ ఓట్లే ఫలితాలను శాసించగలవు కూడా. అందుకే…. ఇప్పుడు కాషాయ దళం ఈ ఓటు బ్యాంక్ మీద ఫోకస్ పెట్టిందట. తాము రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే… కోల్ బెల్ట్ కూడా అత్యంత కీలకమని భావిస్తున్న కాషాయ నేతలు… అక్కడ పాగా వేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అందులో భాగంగానే… సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించింది కేంద్రం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని వేలంతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వ సంస్థకు తాడిచర్ల బ్లాక్ వచ్చేలా చేశారట. సంస్థ భవిష్యత్ కోసం చేసిన ఈ కృషిని ఇప్పుడు కార్మికులకు వివరించే ప్రయత్నంలో ఉన్నారు. సింగరేణికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో సీరియస్‌గా ఉన్నారు మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు. సింగరేణి భరోసా యాత్ర పేరుతో జరుగుతున్న పర్యటనలు ఇందులో భాగమేనని అంటున్నారు. తెలంగాణ గుండె చప్పుడు సింగరేణిని కాంగ్రెస్, BRSలు నాశనం చేశాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. సంస్థని ఆదుకునేది తామేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాడిచర్ల బ్లాక్ కేటాయింపు ప్రభావం బాగా ఉంటుందని, అది పార్టీకి లాభం అవుతుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. తమ పర్యటనల్లో భాగంగా బీజేపీ నేతలు ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆగుతున్నారు. లోకల్ స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు.
ఆ రకంగా మేం మీ తోనే అన్న భావన కలిగిస్తున్నారు. అటు ఇతర కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏదో… వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా తమ పర్యటనల వల్ల పార్టీకి లబ్ది జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చర్యల ద్వారా తెలంగాణ మీద కమలం పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగేలా, విశ్వాసం పెరిగేలా చేస్తున్నారు పార్టీ నేతలు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఇంత ముందే రంగంలోకి దిగడం వెనుక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక వైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం, మరో వైపు ప్రజలు ఇటువైపు చూసేలా చేయడమన్న రెండు లక్ష్యాలను ఏకకాలంలో సాధించాలనుకుంటున్నారట కాషాయ పెద్దలు.

