HYDRAA: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతేడాది సెప్టెంబర్ 3వ తేదీన స్పష్టమైన ప్రకటన కూడా చేశామని తెలిపారు. హైడ్రా పేరుతో అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరారు. లేని పక్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక, అవకతవకలు నిజమైతే హైడ్రా ఉద్యోగులైతే సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ హైడ్రా పేరును వినియోగించుకుని వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన శిక్ష పడేలా చేస్తామని రంగనాథ్ తెలిపారు.
Read Also: Betting App Promotions: చిక్కుల్లో మరో హీరోయిన్?
కాగా, ఇప్పటికే హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడిన పలువురిపై కేసులు కూడా పెట్టామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్లు ఏవైనా ఫిర్యాదులుంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తమ దృష్టికి లేదా ఏసీబీ, విజిలెన్స్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లొచ్చని ఆయన సూచించారు. కాగా, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైడ్రాకు కంప్లైంట్ వస్తే.. దశాబ్దాల సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం లభిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పుకొచ్చారు.