NTV Telugu Site icon

Telangana Rains: నేడు, రేపు భారీవర్షాలు.. 11 జిల్లాలకు భారీ వర్షసూచన..

Telangana Rains

Telangana Rains

Telangana Rains: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు, ప్రజలకు వాతావరణ శాఖ ఊపిరి పీల్చుకునే వార్త చెప్పింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాకాలం వచ్చేసింది. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. వర్షాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలు కొంత ఊరటనిస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Read also: Yadagirigutta Temple: తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం..

హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం కూడా వర్షం కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రస్‌లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇదే జిల్లాలో భీంపూర్ మండలం అర్లిలో 4.2, కామారెడ్డి జిల్లా పిట్లంలో 3.7, నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌లో 3.6, నిజామాబాద్‌ జిల్లా చిమన్‌పల్లిలో 3.5, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. . ఈరోజు తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Balkampet Yellamma: రేపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం వద్ద ఆంక్షలు..